అచ్చ తెలుగు లేఖ

Image

ఒక మంచి తెలుగు సినిమా కి తెలుగు లో రివ్యూ (రివ్యూ ని తెలుగు లో ఏమి అంటారో నాకు తెలీదు, అందుకు క్షమించండి) రాయకపోతే , అది మహా పాపం.

ఈ మధ్య కాలము లో మా నాన్నగారు ఇంటికి వచ్చిన ప్రతి బంధు మిత్రువుకి చూడమని చెప్పిన చిత్రము మిథునం. మొదటి సారి చెప్పినప్పుడు, సరేలే పెద్ద వాళ్ళు చూసే సినిమా ఏమో అనుకున్నాను. రెండో సారి మళ్ళి ఎవరికో చెప్తుంటే, తనికెళ్ళ భరణి బాగా తెలుసేమో అనుకున్నాను…మరి మూడో సారి చెప్తుంటే ఈయనకి చాదస్తం బాగా పెరిగిపోయింది అనుకున్నాను. ఇంతగా చెప్తున్నారు కాబట్టి అసలు సినిమా దేని గురించో చూడాలి అనుకుని, ఇంటర్నెట్ లో ట్రైలర్ (ట్రైలర్ ని కూడా తెలుగు లో ఎం అంటారో నాకు తెలీదు) చూసాను.

“మరి ఇద్దరేనా సినిమా లో” అనుకున్నాను. కాని ట్రైలర్ కొత్తగా అనిపించింది. చూస్తేనే అచ్చ తెలుగు సినిమా అని అర్ధం ఐపోయింది. అయిన ఇది ఏమైనా పవన్ కళ్యాణ్ సినిమా నా మొదటి రోజే చూడడానికి ఆనుకుని ఇంక దాని మీద ఆలోచన మానేస. కొన్ని రోజులు అలా గడిచాక, మా ఇంట్లో పెద్దవాళ్ళు అందరు సినిమా చూసి బాగుంది అన్నారు. నా తమ్ముడు, నా లాంటి వాడికి అయితే ఇంకా నచ్చుతుంది అన్నాడు. ” ఏంటి అప్పుడే నేను వాడి కంటి కి ముసలి వాడిలా కనిపిస్తున్నాన?” ఆనుకుని ఖంగారు పడ్డా. సరేలే ఈ గోల అంతా ఎందుకు సినిమా చూస్తే తెలిసిపోతుంది కదా ఆనుకుని ప్రసాద్స్ సినిమా హాల్ కి వెళ్ళాను.

సినిమా లోకి వెళ్తూనే ఉచితంగా మంచినీళ్ళు ఇంకా పాప్ కార్న్ ఇచ్చాడు. ఆహా! సినిమా గురించి దేవుడు యెరుగు, ఈ ఆఫర్ మాత్రం బాగుంది అనుకున్నాను. ఒక సారి హాల్ మొత్తం చూసా ఎవరైనా నా వయసు కుర్రాళ్ళు కనిపిస్తారు ఏమో అని. అక్కడక్కడ బియ్యం లో రాళ్ళు లాగ ఉన్నారు తప్పితే, మిగితా జనాభా అంత 40+. నిజం చెప్పాలి అంటే కొంచం ముచ్చట వేసింది.

ఇంక అసలు సినిమా విషయానికి కి వస్తే…చాలా రోజుల తరవాత కడుపు నిండా భోజనం చేస్తే ఎలా ఉంటుందో, అలా అనిపించింది. చాలా మామూలుగా, చాలా అందంగా ఉంది సినిమా. చిన్న కథ, కథ లో చిన్న ఇల్లు, ఇంటి చుట్టూ మొక్కలు, ఒక ఆవు దూడ, ఒక బావి, ఇలా చిన్న చిన్న విషయాలలో ఎంత అందం ఉంటుందో ఈ సినిమా లో చూడచ్చు. మన పని మన చేతులతో చేసుకుంటూ, చేసిన పనిని ఆనందిస్తూ, సుబ్బరంగా భోజనం చేస్తూ, కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసి మెలిసి ఎలా ఉండచ్చో ..ఇవన్ని చూసాను. అసలు ఇలాంటి materialistic (ఈ ముక్కని ఎలా రాయాలో కూడా తెలీదు తెలుగు లో) రోజుల్లో ఇలాంటి సినిమా రావడమే గొప్ప.

నేను బాగా భోజనం చేశాను..మీకు బాగా ఆకలి వేస్తే ప్రసాద్స్ వెళ్లి భోజనం చేయండి, అంతే కాని పక్క వాడి అప్పడం లాకునట్టు, ఇంటర్నెట్ లో చూడకండి. సెలవు.

అర్ధం కాకపోతే మన్నించండి, తప్పులు ఉంటే క్షమించండి!